ఏపీలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

Saturday, April 3rd, 2021, 02:30:11 PM IST


ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శథవిధాల ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించడంతో ఇక పోటీ అధికార పార్టీ వైసీపీ, బీజేపీ-జనసేన కూటమి మధ్యనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న ఏపీ బీజేపీ సీనియర్ నేతలను, పక్క రాష్ట్రాల నేతలను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తుంది.

అయితే ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నేడు తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్‌రావు రాజకీయ రణరంగం నుంచి టీడీపీ తప్పుకుందని, ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే సంఖ్య పెరుగుతుంది తప్పా ఉపయోగం ఉండదని, అధికారంలో ఉండి ప్రశ్నించలేని పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మతప్రచారం జరుగుతుందని దీనిని బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.