అసలే అసహనం పెరిగి, పాకిస్తానీ కళాకారులను సైతం భారత్ కు రానీయని నేపధ్యంలో ప్రముఖ పాకిస్థానీ సింగర్ ‘అద్నాన్ సమీ’ జనవరి 1 నుండి భారతీయుడు కాబోతున్నాడు. ఈమేరకు అతనికి అన్ని అనుమతులను కూడా భారత హోమ్ శాఖ మంజూరు చేసింది. అద్నాన్ సమీ భారతీయులకు కొత్తేం కాదు. తన గాత్రంతో ఇండియన్స్ కి బాగానే పరిచయస్థుడు. ఎంతంటే విజువల్ చూడకుండా ఆడియో మాత్రమే విని ఇది అద్నాన్ సమీ పాడిన పాటే అని గుర్తుపట్టేంత.
అద్నాన్ మొదటిసారి మార్చ్ 2001 న భారత్ కు వచ్చాడు. ఈ మధ్యే 2015కి అతని పాస్ పోర్ట్ కాలపరిమితి ముగిసిపోయినప్పటికీ ఆయన దాన్ని రెన్యువల్ చేయించుకోలేదు. కారణం భారత్ పౌరుడు కావాలన్న ఆయన బలమైన కొరికే. కొంతకాలం క్రితమే ఆయన భారత్ సర్కారును తనకు భారత పౌరసత్వం ఇవ్వాల్సిందిగా కోరితే భారత సర్కార్ ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పౌరసత్వం ఇచ్చేసింది. ఇక అద్నాన్ జనవరి 1 నుండి భారతీయుడవుతుండటంతో భారత్ లో ఉన్న ఆయన అభిమానులు పొంగిపోతున్నారు.