డియర్ అరవింద్..!

Saturday, April 4th, 2015, 06:51:30 PM IST


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల ఆప్ పార్టీలో నుండి బహిష్కరణకు గురైన ప్రశాంత్ భూషణ్ సుదీర్ఘమైన లేఖను రాసారు. ఈ మేరకు ఆయన కేజ్రీవాల్ ను తన లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఇక డియర్ అరవింద్ అంటూ లేఖను మొదలుపెట్టిన ప్రశాంత్ భూషణ్ తన గోడును వివరించారు. అటుపై ప్రశాంత్ భూషణ్ తన లేఖలో మార్చి 28న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ పరిస్థితి, భవిష్యత్ మార్గ నిర్దేశకం చెయ్యాల్సిన కేజ్రివాల్ తమపై ఆరోపణల దాడి చేసి, తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా, ఓటింగ్ పెట్టి తమను బహిష్కరించడం భావ్యమా? అని ప్రశ్నించారు. అనంతరం పలు సభ్యులను పార్టీ నుండి గెంటేసి ఎడిట్ చేసిన వీడియోను ప్రపంచం ముందు కేజ్రీవాల్ చూపించారని, ప్రసంగించిన మొత్తం వీడియోను బహిర్గతం చెయ్యలేక పోయారని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ఇక లోక్ సభ ఎన్నికల నేపధ్యంగా కేజ్రీవాల్ కు తనకు మధ్య కొంత అంతరం వచ్చిందని, పార్టీలో కేవలం కేజ్రీ నిర్ణయాలే అమలు కావాలని పట్టుబట్టడంతో ఆ నిర్ణయాలు పార్టీకి, ప్రజలకు కీడు కలిగించాయని తన లేఖలో చెప్పుకొచ్చారు. అలాగే కేజ్రీవాల్ లక్ష్యాన్ని చేరడం కోసం అనైతిక కార్యకలాపాలకు పాల్పడడమే కాక, నేర పూరితంగానూ వ్యవహరించారని ప్రశాంత్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలలో నామ రూపాలు లేకుండా పోతుందని భావించి కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని తెలిపారు. ఇక ఈ విషయంపై పార్టీ ఆమోద ముద్రతో ముందుకు సాగాలని తాను కూడా సూచించినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. అటుపై వచ్చే ఐదేళ్ళు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపి అవినీతి రహిత స్వచ్చ పాలనను కేజ్రీవాల్ అందిస్తారని కోరుకుంటున్నానని ఆసిస్తూ గుడ్ బై అండ్ గుడ్ లక్ అంటూ ప్రశాంత్ భూషణ్ తన లేఖకు ముగింపు పలికారు.