ఇకపై చెత్త కనిపించేందుకు వీల్లేదు!

Friday, May 22nd, 2015, 06:40:20 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం అధికారులతో ‘స్వచ్చ్ హైదరాబాద్’పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ హైదరాబాద్ రోడ్లపై ఇక నుండి చెత్త కనిపించకూడదని, రోడ్లన్నీ అద్దంలా మెరవాలని, రోడ్లపై చెత్త వెయ్యకుండా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. అలాగే రెండు నెలలలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని, ప్రజలపై తనకు విశ్వాసముందని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇళ్ళపై నుండి వెళుతున్న హైటెన్షన్ వైర్లను తొలగించాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు చెప్పామని తెలిపారు. అలాగే నగరంలోని ప్రతీ ఇంటికి ప్రభుత్వం రెండు చెత్త బుట్టలను ఇస్తుందని, ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చెయ్యాలని సూచించారు. ఇక చెత్తను తొలగించేందుకు ఆటో ట్రాలీని ఏర్పాటు చేసి దానిని స్థానిక నిరుద్యోగులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు.