దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నేడు ప్రారంభమయ్యింది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతుంది. అయితే విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్ వర్కర్ రాధ కళ్లు తిరిగి ఇబ్బందికి లోనయ్యారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స అందించారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మొత్తం 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది. అయితే తొలి రోజు ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి టీకాను ఇవ్వబోతున్నారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచనున్నట్టు కేంద్రం తెలిపింది. తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు కేంద్ర తెలిపింది. అయితే వ్యాక్సిన్ పంపిణీపై ఏదైనా సందేహాలు ఉంటే 1075 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు.