ఆప్ విజయంపై కెసిఆర్ హర్షం!

Tuesday, February 10th, 2015, 05:55:47 PM IST


ఢిల్లీలో చారిత్రాత్మకంగా అప్ పార్టీ సాధించిన అత్యద్భుత విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ అధినేత అరవింద్ కేక్రీవాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ ఇంకా మాట్లాడుతూ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజలు ఆలోచిస్తున్నారని తెలుపడానికి ఆప్ విజయమే నిదర్శనమని కొనియాడారు. అలాగే ఫలితాలను బట్టి చూస్తే ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

కాగా ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 67 స్థానాలు ఒక్క ఆప్ పార్టీకే దక్కాయి. ఇక అధికార భాజపా పార్టీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే ఒకసారి ముఖ్యమంత్రిగా స్వల్ప కాలం పదవిలో ఉండి అనంతరం రాజీనామా చేసిన కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు మరోసారి పట్టం గట్టారు. కాగా కిరణ్ బేడీ వంటి శక్తివంతమైన మహిళను భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది అనడానికి ఢిల్లీలో ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోవడాన్ని ఉదాహరణ చెప్పుకోవచ్చు.