పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి పోటి..?

Tuesday, April 12th, 2016, 05:41:02 PM IST


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో పోటీ చేయడం ఖాయం అయిపొయింది. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ సంస్థాగతంగా బలపడేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనసేన కార్యకర్తల రిక్రూట్మెంట్ దగ్గరి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే బస్సు యాత్ర చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టి సమస్యలను తెలుసుకోవాలని అనుకుంటున్నారు. రైతుల సమస్యల గురించి, యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఇతరత్రా సమస్యల గురించి ఓ అవగాహనకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇక ఇదిలా ఉంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. జనసేన పార్టీ విలువలకు భంగం కలుగకుండా వ్యవహరిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక, పవన్ పార్టీ పోటీలోకి దిగితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తారు అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది ఇంకా ఒక అవగాహనకు రాలేదు. అయితే, జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది త్వరలోనే తేలిపోతుంది.