తెరపై కనిపించిన వారు : నిఖిల్ కుమార్, దీప్తి సతి..
కెప్టెన్ ఆఫ్ ‘జాగ్వార్’ : ఏ. మహదేవ్
మూలకథ :
మెడిసిన్ చదివే ఓ కుర్రాడు కృష్ణ (నిఖిల్ కుమార్), ఎవ్వరికీ తెలియకుండా మారువేశంలో పలు హత్యలు చేస్తూంటాడు. సరదాగా చదువుకునే ఓ కుర్రాడు ఇలా హత్యలు ఎందుకు చేస్తూంటాడు? దానికి కారణమేంటి? అన్నదే సినిమా.
విజిల్ పోడు :
1. ఎంట్రీ సీన్ బాగుంది. సినిమాకు ఆ సీన్‌తోనే మంచి ఎంగేజింగ్ స్టార్ట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చే ఛేజ్, ఇంటర్వెల్ తర్వాత ఒక కార్ ఫైట్.. లాంటివి విజిల్స్ వేయిస్తాయి.
2. రావు రమేష్ నేపథ్యంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ బాగుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్ వల్లే సినిమాకు కాస్త కూస్తో ఎమోషన్ తోడై అక్కడక్కడా నిలబడింది.
3. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. లైటింగ్‌ను సరిగ్గా వాడడం, ఫ్రేమింగ్‌ను అదిరిపోయేలా సెట్ చేసుకోవడం వంటి వాటిల్లో ఆయన ప్రతిభను అడుగడుగునా చూడొచ్చు.
ఢమ్మాల్ – డుమ్మీల్ :
1. ఇలాంటి సినిమాలెవరైనా స్టార్ హీరోలు చేస్తారు. ఇక్కడ మాత్రం హీరో కొత్తవాడవ్వడమే ఢమ్మాల్. చెప్పే డైలాగ్స్‌లో పంచ్ లేక, కథలోని ఎమోషన్‌ను పండించలేక హీరో అవస్థపడుతూంటే సినిమా ఢమ్మాల్గానే నడుస్తూంది. ఒక్క డ్యాన్సులు, ఫైట్స్ చేయడంలో తప్ప నిఖిల్ ఈ సినిమాలో చేసిందేమీ లేదు.
2. హీరో-హీరోయిన్ల లవ్‌ట్రాక్ అస్సలు బాలేదు. ఒక పెద్ద బాధ్యతను తన మీద వేసుకున్న హీరో, హత్యలు చేసే హీరో, ఊరికే ఒక అమ్మాయిని చూడడం, ప్రేమించడం, ఇటు ప్రేమిస్తూనే అటు భారీ ఫైట్లు చేస్తూండడం అదంతా ఢుమ్మీల్ అన్నట్లే నడుస్తూంటుంది.
3. ఇక సెకండాఫ్‌లో వచ్చే కామెడీ ట్రాక్స్ అయితే ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. బ్రహ్మానందం కామెడీ ఏంటో? హీరో, విలన్ ఇంట్లోనే ఉంటూ వాళ్ళను బఫూన్స్ చేయడం ఏంటో? అంతా ఢుమ్మీల్!
దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!
–> లాజిక్ అన్నది ఎందుకు పట్టించుకోరో కానీ ఈ సినిమా అంతా లాజిక్స్ లేకుండా చిత్ర విచిత్రంగా నడుస్తుంది. ఒక పేరుమోసిన న్యూస్ ఛానల్‌ను ఓ అనామకుడు హ్యాక్ చేయడం, కుక్క మనిషి బొమ్మను గీయడం.. ఇలాంటి లాజిక్‌తో సంబంధం లేని సిత్రాలెన్నో ఉన్నాయీ సినిమాలో!
–> హీరో ఏం చేసినా అదంతా మొదట్నుంచీ బాగానే ఉంటుందందరికీ. ఆయన ఏ రిస్కీ ఫైట్లు చేసినా, ఎవ్వరిని కొట్టినా, లాజిక్‌తో సంబంధం లేకుండా ఎవర్నైనా చంపినా జనం ఆయన్ను ఆసక్తికరంగానే చూస్తారు. ఇలాంటివి ఈ సినిమాలో అడుగడుగునా ఉన్నాయి. అవన్నీ కోట్లు కుమ్మరించి తీసిన సన్నివేశాలు కావడం అన్నింటికంటే పెద్ద సిత్రం..!
–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..
మిస్టర్ ఏ : ఆ ఖర్చేంట్రా బాబూ.. ప్రతీ సీన్‌కీ కోట్ల రూపాయలు తగలేసినట్లు కనిపిస్తోంది!?
మిస్టర్ బి : ఆ కనిపించేదన్నా బాగుంటే తగలేసిన కోట్లకు విలువైన ఉండేది!!
మిస్టర్ ఏ : (సైలెంట్)