సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి.. జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Thursday, April 15th, 2021, 05:41:03 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియా సమావేశం నిర్వహించిన జానారెడ్డి నిన్న హాలియా సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానని మాట్లాడారని, కానీ మా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో చావు నోట్లో తల పెట్టి తెలంగాణ ఇచ్చిందన్న విషయం మరచిపోవద్దని సూచించారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆనాడు రాష్ట్ర సాధన కోసం మేం పూర్తిగా సహకరించాం కాబట్టే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జానారెడ్డి అన్నారు.

అయితే తనకు పదవులు కొత్తకాదని సాగర్‌లో తాను చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తుపెట్టుకున్నారని ఖచ్చితంగా ఈ సారి సాగర్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని జానారెడ్డి అన్నారు. ఓట్ల కోసం రెండు సార్లు సాగర్‌కు వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత పత్తా ఉండడని అన్నారు. గెలిచాక కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మాట్లాడని మరి ఇన్ని రోజులు ఎందుకు ఇక్కడికి రాలేదని ప్రశ్నించారు. ఓట్లు ఉన్నప్పుడు తప్పితే మిగతా రోజులు ఆయన ఫాంహౌస్ నుంచి బయటికి రాడని జానా రెడ్డి ఎద్దేవా చేశారు.