ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం బహిష్కరిస్తున్నాం.. పవన్ సంచలన నిర్ణయం..!

Friday, April 2nd, 2021, 03:00:22 AM IST


ఏపీలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. కొత్త ఎస్ఈసీగా నేడు బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ మొదటి రోజే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం ఏకపక్షంగా ఉందని అన్నారు.

రెండో తేదిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ సమావేశానికి రావాల్సిందిగా గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్ఈసీ, ఈలోపే రాత్రికి పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని, ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్య అని పవన్ అన్నారు. ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు రాక ముందే ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ది చేకూర్చడానికేనని జనసేన భావిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.