‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : జయమ్ము నిశ్చయమ్మురా – మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి పర్వాలేదనిపించాడబ్బా !

Friday, November 25th, 2016, 01:47:57 PM IST


తెరపై కనిపించిన వారు : శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ
కెప్టెన్ ఆఫ్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ : శివ రాజ్ కనుమూరి

మూల కథ :

సర్వ మంగళం (శ్రీనివాస్ రెడ్డి) తెలంగాణలోని కరీంనగర్ నుండి కాకినాడకు ఉద్యోగరీత్యా వచ్చిన ఒక పల్లెటూరి వ్యక్తి. మూఢనమ్మకాలను, స్వామిజీలను ఎక్కువగా నమ్మే సర్వమంగళం కాకినాడలో రాణి (పూర్ణ) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయుంచుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ అంతలోనే తాను ప్రేమించిన రాణి తనకు దూరమయే పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి కష్టాల్లో సర్వమంగళం ఎవరి సహాయం, సలహా లేకుండా తనంతట తానే రంగంలోకి దిగుతాడు. అలా దిగిన తను ఎలా రాణి ప్రేమను దక్కించుకున్నాడు ? ఆటను పడ్డ కష్టాలేమిటి ? అతనిలో వచ్చిన మార్పేమిటి ? అన్నదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :

–> ఈ సినిమాకి రచయిత, దర్శకుడు శివరాజ్ కనుమూరి రాసుకున్న సహజమైన కథ, కథనం ప్రధాన బలాలు. ముఖ్యంగా ఇందులో పిరికివాడు ధైర్యవంతుడిగా మారడం అనే అంశం వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి కథ కథానాలకు ఒక విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథనంతో పాటు దర్శకుడు నడిపిన కామెడీ అన్ని సందర్భాల్లో సమపాళ్లలో ఉంటూ మంచి వినోదం పంచింది. పోసాని, కృష్ణ భగవాన్ లపై నడిచే హాస్యం బాగా వర్కవుటయింది. కాబట్టి దీనికి రెండో విజిల్ వెయ్యొచ్చు.

–> ఇక ఒక పిరికివాడైన సామాన్యుడిగా శ్రీనివాస్ రెడ్డి నటన సహజంగా చాలా బాగుంది. అలాగే ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టి స్వశక్తి మీద బ్రతకాలనుకునే అమ్మాయిగా పూర్ణ నటన కూడా మెప్పించింది. కనుక వీరిద్దరి ప్రదర్శనకు చివరి విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఇక ఢమాల్ డుమ్మీల్ పాయింట్ల విషయానికొస్తే ముందుగా చెప్పికోవలసింది ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నెమ్మదించిన కథనం గురించి. ఫస్టాఫ్ మొదటి 20 నిముషాలు గడిచాక పాత్రల పరిచయామ్ కోసం దర్శకుడు ఎక్కువ సమయం తీసుకుని కాస్త బోర్ కొట్టించాడు.

–> ఇక సెకండాఫ్ లో అయితే అనవసరపు పాత్రలు, సన్నివేశాలు ఎక్కువగా వచ్చి చాలాసేపు విసుగనిపించింది. దాని వలన అసలు కథ కాస్త పక్కదారి పట్టింది.

–> ఇక సినిమాలోనే కీలకమైన పిరికివాడు ధైర్యవంతుడిగా మారడం అనే కీలక సన్నివేశ సందర్భం బాగానే ఉన్నా దాన్ని తెరపై చూపించిన తీరు అంట బలంగా లేక తేలిపోయింది.

దావుడా.. ఈ సిత్రాలు చూశారూ ..!!

–> సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ పెళ్లి ఆపు చేయడానికి పూజారైన పోసాని సహాయం కోరగా అతనేదో ధూపం వేసి పెళ్లి కొడుకు స్పృహ తప్పేలా చేసి అతనికి ఆ ఒక సందర్భంతోనే మూర్ఛ రోగముందని తేల్చేయడం, పెళ్లి ఆగిపోవడం కూసింత వింతగానే తోచింది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఏరా సినిమా చూశావుగా.. శ్రీనివాస్ రెడ్డి మీద నీ అభిప్రాయం ఏంటి ?

మిస్టర్ బి : ఏముంది.. కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుని మంచి కథనే ఎంచుకుని పర్వాలేదనిపించాడనిపిస్తోంది. మరి నువ్వేమంటావ్ ?

మిస్టర్ ఏ : ఏమంటాను అదే అంటాను.