జంతువులకు ప్రత్యేకంగా ఓ ఎయిర్ పోర్ట్

Thursday, January 22nd, 2015, 05:51:27 PM IST


మనుషులకే కాదు ఇక మీదట జంతువులకు ప్రత్యేకంగా ఓ ఎయిర్ పోర్ట్ సిద్దం అవుతున్నది. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్ట్ కు పక్కనే ఉన్న 1,78,000 చదరపు అడుగుల స్థలంలో జంతువుల కోసం ప్రత్యేకంగా ఎయిర్ పోర్ట్ నిర్మిస్తున్నారు. 48మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మిస్తున్నారు. 2016 నుంచి ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానున్నది. జాన్ ఎఫ్ కెన్నడి ఎయిర్ పోర్ట్ కు ఆనుకొని ఉన్న కార్గో టెర్మినల్ కు పక్కనే ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతున్నది. ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 70వేల జంతువులను ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చునని అధికారులు చెప్తున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతలను ఆర్క్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పగించారు.

కేవలం పెంపుడు జంతువులనే కాకుండా మిగతా జంతువులు అయిన గుర్రం, ఆవులు తదితర వాటిని ప్రపంచంలో ఎక్కడికైనా కొత్తగా నిర్మించబోయే ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, జంతువుల కోసం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగా గదులను కూడా ఏర్పాటు చేస్తున్నారంట. వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా డాక్టర్లను కూడా నియమిస్తారని అధికారులు చెప్తున్నారు.