చంద్రబాబు డిసీషన్.. టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా..!

Friday, April 2nd, 2021, 10:12:30 PM IST


ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం నిరాశ కలిగించిందని, పార్టీ నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.

అయితే తనకు పార్టీలో పదవులు ముఖ్యం కాదని, కార్యకర్తలతో కలిసి కార్యకర్తగా ఉంటానంటూ జ్యోతుల చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతానని ఆయన అన్నారు. నియోజక వర్గంలో తనను, పార్టీని నమ్ముకుని ఉన్నవారి కోసం తాను అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని అన్నారు. ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా తప్పుపట్టారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ అని గెలిచినా, ఓడినా సిద్ధాంతాలను మాత్రం విడవరాదని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు కేడర్ అభిప్రాయాలను తీసుకోవాలని అన్నారు.