అమెరికాలో మృతి చెందిన కామారెడ్డి వాసి – నిద్రలోనే జరిగిపోయింది…?

Friday, March 13th, 2020, 12:04:09 PM IST

గురువారం నాడు రాత్రి అమెరికాలో కామారెడ్డి జిల్లా, భిక్కనూరు మండలానికి చెందినటువంటి బూర్ల అరుణ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. కాగా గత కొంత కాలంగా తీవ్రమైన జ్వరం, లోబీపీ తో బాధపడుతున్నటువంటి అరుణ్ కుమార్ గురువారం రాత్రి నిద్రలోనే మరణించారు. వివరాల్లోకి వెళ్తే… అమెరికాలోని హోస్టన్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నటువంటి అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తి గత కొంత కాలంగా తీవ్రమైన జ్వరం, లోబీపీ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం) కూడా అమెరికా నుండి కామారెడ్డిలో ఉన్న తన అమ్మతో మాట్లాడి, మందులు వేసుకొని నిద్రపోయాడు.

ఆ తరువాత అరుణ్ కుమార్ భార్య తన ఉద్యోగానికి వెళ్ళిపోయింది. కానీ రజినీ ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా అరుణ్ ఎత్తకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూసింది. ఎన్నిసార్లు పిలిచినా కూడా అరుణ్ పలకకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించగా, అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్ మృతి చెందాడని వివరించారు. కాగా ప్రస్తుతానికి కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో అరుణ్ మృతదేహాన్ని ఇండియా కి తరలించేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చని సమాచారం. అయితే ఈ విషయాన్నీ తెలుసుకున్న అరుణ్, రజినీ తల్లిదండ్రులు గురువారం నాడు అమెరికాకు బయలుదేరారు.