‘రివ్యూ రాజా’ తీన్‌మార్ : కనుపాప – పాప కోసం అంధుడి పోరాటం!

Saturday, February 4th, 2017, 03:35:57 PM IST


తెరపై కనిపించిన వారు : మోహన్ లాల్, సముద్రఖని, విమలా రామన్..
కెప్టెన్ ఆఫ్ ‘కనుపాప’ : ప్రియదర్శన్

మూలకథ :

జయరామ్ (మోహన్ లాల్) అనే కళ్ళు కనిపించని వ్యక్తి ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తూ ఫ్లాట్స్‌లోని అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే మూర్తి అనే జడ్జికి జయరామ్‌తో మంచి అనుబంధం ఉంటుంది. మూర్తికి వాసు అనే ఓ నిందితుడి నుంచి ప్రాణగండం ఉంటుంది. ఆ నిందుతుడు అతడిని చంపేస్తాడు కూడా. మూర్తి మరణించిన తర్వాత అతడు అప్పగించిన బాధ్యతను జయరామ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాడూ? అంధుడైన అతడు బలవంతుడైన వాసును ఎలా ఎదిరించాడూ? అన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. మోహన్ లాల్‌కు కంప్లీట్ యాక్టర్ అన్న పేరుంది. ఆయనకు ఆ పేరు ఎందుకొచ్చిందో మరోసారి నిరూపించి చూపే సినిమా ఇది. ఒక అంధుడిగా ఆయన చూపిన నటనను అద్భుతమనే చెప్పాలి. మోహన్ లాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా, ఆయన తన ప్రెజెన్స్‌తో కట్టిపడేసి విజిల్స్ వేయించేలా నటించాడు.

2. సెకండాఫ్‌లో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు కొన్ని సూపర్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో, విలన్‌ల మధ్యన నడిచే చిన్న మైండ్‌గేమ్ ఎపిసోడ్‌లో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలైతే విజిల్స్ వేయించకుండా ఉండవు.

3. విజువల్స్ కట్టిపడేసేలా ఉంటూ చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉన్నాయి. మేకింగ్ పరంగా చేసిన మ్యాజిక్‌తో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా కనిపించి విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. ఫస్టాఫ్‌లో కొన్ని అనవసరమైన సన్నివేశాలను పెట్టి సాగదీయడం కాస్త బోర్ కొట్టించింది. సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వచ్చినా సినిమా అంతా స్లోగానే నడుస్తూ ఉండడం కూడా బాలేదు.

2. విలన్ పగ పగ అంటూ తిరగడం కూడా కాస్త రొటీన్ అనిపించింది. అతడు సైకోగా మారి చేసే హత్యలు చేస్తూండడం అన్నదాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేదనిపించింది.

3. ఒక సుప్రీమ్ కోర్టు జడ్జి, తానిచ్చిన తీర్పు గురించి జీవితాంతం ఆలోచిస్తూ ఉండడం కూడా ఓవర్ అనిపించింది.

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> హీరో అంధుడైనా అతడికి బుద్ధి బలం, శారీరక బలం మాత్రం ఉంటాయి. ఎంతటివారినైనా మట్టికరిపిస్తాడు. అయినా సరే ఓ స్టేషన్‌లో పోలీసులందర్నీ కొట్టి పారిపోవడం మాత్రం కొంత ఓవర్‌గానే తోచింది.

–> హీరోయిన్ విమలా రామన్ పాత్రను కూడా చిత్రి విచిత్రంగా డిజైన్ చేశారు. ఆమె పాత్ర జయరామ్‌ను ఇష్టపడడం అనేదే అస్సలు బాలేదనిపించింది.

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : మోహన్ లాల్ అదరగొట్టేశాడు కదరా!?
మిస్టర్ బీ : అదిసరే, సినిమాయే నెమ్మదిగా నడిచింది.
మిస్టర్ ఏ : అప్పటికీ సెకండాఫ్ థ్రిల్లింగ్‌గానే ఉంది కదరా!?నాకైతే ఈ థ్రిల్లర్ బాగా నచ్చింది.
మిస్టర్ బీ : నేనూ నచ్చలేదు అనలేదుగా!