రివ్యూ రాజా తీన్‌మార్ : కాటమరాయుడు – రాయుడి దెబ్బ సెకండాఫ్లో సరిగ్గా తగల్లేదు !

Friday, March 24th, 2017, 06:15:25 PM IST


తెరపై కనిపించిన వారు : పవన్ కళ్యాణ్, శృతి హాసన్

కెప్టెన్ ఆఫ్ ‘మా అబ్బాయి’ : షోర్ కుమార్ పార్థసాని

మూలకథ :

రాయలసీమలోని ఓ ఊరికి పెద్దైన కాటమరాయుడు (పవన్ కళ్యాణ్) ఆ ఊరి పేదలకు సహాయపడుతుంటాడు. పెళ్ళైతే భార్య తనని, నలుగురు తమ్ముళ్లని విడదీస్తుందని నమ్మి పెళ్ళికి, ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా అన్నయ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుని రాయుడుని అవంతిక (శ్రుతిహాసన్) తో ప్రేమలో పడేలా చేస్తారు.

అలా సంతోషంగా ఉన్న తరుణంలో కాటమరాయుడు, అవంతికల మీద అటాక్ జరుగుతుంది, అవంతిక కుటుంబం పెద్ద ఆపదలో ఉందని రాయుడికి తెలుస్తుంది. అవంతిక కుటుంబం ఎదుర్కుంటున్న ఆపద ఏమిటి ? ఆ ఆపద నుండి రాయుడు వాళ్ళను ఎలా కాపాడాడు ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :
–> సినిమాలో మొదటి విజిల్ పవన్ కళ్యాణ్ కే వేయాలి. సినిమా మొత్తాన్ని పవన్ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ముందుకు నడిపాడు. పంచెకట్టుతో, కోర మీసంతో కొత్తగా కనిపిస్తూ అభిమానుల్ని అలరించాడు.

–> అలాగే ఫస్టాఫ్ కథనం, దాన్ని చాలా వినోదభరితంగా తెరకెక్కించిన దర్శకుడు డాలికి రెండవ విజిల్ వేయాలి. ఆ భాగం మొత్తం పవన్ క్యారెక్టరైజేషన్, అలీ కామెడీ, రొమాన్స్ తో సరదాగా గడిచిపోతుంది.

–> ఇక శృతి హాసన్ గ్లామరస్ గా కనిపిస్తూనే మంచి నటన కనబర్చింది. రావు రమేష్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. సెకండాఫ్ ఆరంభంలో వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు బాగుంటాయి. ఈ అంశాలన్నింటికీ కలిపి మూడో విజిల్ వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమాలో ప్రధాన బలహీనత సెకండాఫ్ అనే చెప్పాలి. ఆరంభం బాగేనా ఉన్నా పోను పోను సినిమా రొటీన్ గా తయారైంది. దీంతో ఆసక్తి కాస్త వరకు సన్నగిల్లింది.

–> ఇక సంగీత దర్శకుడు అనూపరూబేన్స్ ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సెకండాఫ్ లో మాత్రం అస్సలు ఊపులేని స్కోర్ కొట్టి సినిమాలోని ఇంటెన్సిటీని దెబ్బకొట్టాడు.

–> క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఏమంత గొప్పగా లేదు. అన్ని సినిమాలాగే రొటీన్ గా ఉంది. పైగా అందులోని ఫైటింగ్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకోలేదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఫస్టాఫ్లో శృతి హాసన్ పవన్ ఉండే ఊళ్ళోనే ఆయన ఇంటి పక్కనే ఉంటూ ఆయన్ను ప్రేమిస్తుంది. అతనికి చాలా గొడవలున్నాయని మాత్రం గ్రహించలేదు. అది కాస్త విచిత్రంగానే ఉంటుంది.

చివరగా సినిమా చూసియాన్ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: పవన్ మళ్ళీ కొట్టాడ్రా…
మిస్టర్ బి : అవును కొట్టాడు. కానీ..
మిస్టర్ ఏ: కానీ ఏంట్రా ?
మిస్టర్ బి : సెకండాఫ్ ఇంకా బాగుంటే విషయం వేరేలా ఉండేది.
మిస్టర్ ఏ: అవును నిజమే.. సెకండాఫ్లో రాయుడి దెబ్బ సరిగ్గా తగల్లేదు.