ఇద్దరు సీఎంలకు ఒకేసారి అస్వస్థత?

Tuesday, June 30th, 2015, 01:14:59 PM IST


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు నేడు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం గొంతు నొప్పితో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ మేరకు చంద్రబాబు నేడు కేర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఇక మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం విశ్రాంతి తీసుకోవడానికి తన అపాయింట్మెంట్లు అన్నింటినీ కెసిఆర్ రద్దు చేసుకున్నారు.

అయితే ఓటుకు నోటు కేసులో నేడు రేవంత్ బెయిల్ విచారణ వ్యవహారంపై మాత్రం అంత అస్వస్థతలోనూ కెసిఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ తో సమావేశమయ్యి కేసు పురోగతిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్ధం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విందు ఇస్తున్న నేపధ్యంగా హాజరుకావాల్సిన ముఖ్యమంత్రులు ఇద్దరూ ఉన్నపళంగా అస్వస్థతకు గురికావడంతో వీరి హాజరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.