కేజ్రీవాల్ కన్నా కిరణ్ బేడి బెటరట..!

Thursday, January 22nd, 2015, 02:05:00 PM IST


ఢిల్లీఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఇప్పటివరకు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగ, తాజాగా, కిరణ్ బేడికి ప్రముఖుల నుంచి అనూహ్యంగా మద్దతు లభిస్తుండటంతో బీజేపి శ్రేణులలో ఉత్సాహం వెళ్లివిరుస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొండత అండగా ఉన్న శాంతి భూషణ్ తాజాగా కిరణ్ బేడిని పొగడటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఢిల్లీతో కిరణ్ బేడికి సుదీర్ఘమైన అనుబంధం ఉన్నదని.. ఆమె మంచి అడ్మినిస్ట్రేటర్ అని అన్నారు. ఇక, బీజేపి కిరణ్ బేడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం ఆపార్టీ రాజకీయ చతురతకు తార్కాణం అని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఏఏపి కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్ బేడి అయితేనే బెటర్ అని శాంతి భూషణ్ వ్యాఖ్యానించడం ఇప్పడు అందరిలోనూ చర్చనీయాంశం అయింది. ఈ వ్యాఖ్యలు ఆమ్ ఆద్మీ పార్టీకి మింగుడు పడటం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సన్నిహితంగా ఉన్న శాంతి భూషణ్ వంటి వ్యక్తే.. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే.. తమ పార్టీ ఎలా గెలుస్తుందని వారు వాపోతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు శాంతి భూషణ్ వ్యక్తిగతమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంటున్నది.