వైఎస్ షర్మిల పార్టీలో చేరికపై కొండా దంపతుల క్లారిటీ..!

Saturday, April 17th, 2021, 04:42:37 PM IST

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిలకు స్పందన బాగానే లభిస్తుంది. ఇంకా పార్టీ ప్రకటన చేయకముందే చాలా మంది నేతలు షర్మిల అంచున చేరిపోయి తమ మద్ధతు అందిస్తామని చెబుతున్నారు. గతంలో వైఎస్ ఫ్యామిలీతో సత్సంబందాలు కలిగిన నేతలంతా షర్మిల నాయకత్వానికి జై కొడుతున్నారు. అయితే వైఎస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ‌, ఆమె భ‌ర్త కొండా ముర‌ళిని కూడా షర్మిల పార్టీలోకి ఆహ్వానించారని, త్వరలోనే కొండా దంపతులు షర్మిల పార్టీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే దీనిపై కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేసిన కొండా ముర‌ళి షర్మిల పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. వైఎస్ షర్మిల పార్టీ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని కానీ ఎట్టిపరిస్థితుల్లో రాలేమని చెప్పామ‌ని అన్నారు. పార్టీ మారితే వైఎస్ షర్మిల డబ్బు ఇస్తుంది కానీ మాకు విలువలు ముఖ్యమని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే గతంలో వైఎస్ జ‌గ‌న్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని ఆ తర్వాత జగన్ కనీసం పలకరించ‌లేద‌ని కొండా మురళి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని కొండా మురళి సూచించారు.