కేంద్రమంత్రి హర్షవర్థన్కు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా కోరారు. అయితే హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉందని, ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను ఇక్కడి బయో టెక్ కంపెనీలు తయారు చేస్తున్నాయని అన్నారు. . ప్రపంచం మొత్తం లోని వాక్సిన్ లలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోని తయారవుతున్నాయని అన్నారు.
అయితే దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలని గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా కోరారు.