రివ్యూ రాజా తీన్‌మార్ : లక్కున్నోడు – కాసేపు నవ్వుకుని సరిపెట్టుకోవాల్సిందే

Thursday, January 26th, 2017, 05:35:48 PM IST


తెరపై కనిపించిన వారు : మంచు విష్ణు, హన్సిక

కెప్టెన్ ఆఫ్ ‘లక్కున్నోడు ‘ : రాజ్ కిరణ్

మూలకథ :

పుట్టుకపోతే లక్కుతో పాటే బ్యాడ్ లక్ ని కూడా వెంటబెట్టుకుని తీసుకొచ్చుకున్న లక్కీ (మంచు మనోజ్) అనే కుర్రాడు తన నాన్న చేత లక్కీ అని ప్రేమగా పిలిపించుకోవాలని అనుకుంటుంటాడు. అలాంటి చిత్రమైన పరిస్థితిలో ఉన్న లక్కీ ఒకరోజు పాజిటివ్ పద్మావతి (హన్సిక)ని చూసి లవ్ లో పడతాడు.

పద్మావతి కూడా అతన్ని ప్రేమిస్తుంది. అలా అతని సాగుతుండగా అనుకోకుండా అతనికి రూ. 25 కోట్లు దక్కుతాయి. అసలు ఆ డబ్బు ఎవరిది ? ఆ డబ్బు లక్కీ దగ్గరికి ఎందుకొచ్చింది ? ఆ డబ్బు లక్కీ జీవితాన్ని ఏ మలుపు తిప్పింది ? అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

–> సినిమా ఫస్టాఫ్ ఆరంభం కాస్త భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా లక్కీ ఫ్లాష్ బ్యాక్ చూపించిన తీరు చాలా బాగుంది కనుక దానికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక ఫస్టాఫ్ లో సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను పాత్రలతో, సెకండాఫ్ లో పోసాని పాత్రతో పండించిన కామెడీ బాగానే నవ్వించింది కనుక దానికి రెండవ విజిల్ వేసుకోవచ్చు.

–> అలాగే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశాలు లాజికల్ గా కథకు బాగా కనెక్టై మంచి టైమింగ్ తో కొత్తగా అనిపించాయి. కనుక వాటికి ఆఖరి మూడవ విజిల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> ఈ సినిమాకు అతిపెద్ద ఢమ్మాల్ విలన్ పాత్ర. గెటప్ కు తగ్గ బలం ఆ పాత్రలో ఏ కోశానా కనిపించలేదు. దీంతో సినిమా ఊపందుకోవాల్సిన చాలా చోట్ల డీలా పడిపోయింది.

–> అలాగే సెకండాఫ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ఎక్కడా ఆకట్టుకోలేదు. ప్రతి సీన్ రొటీన్ గా ఉండటమేగాక ఫ్యామిలీ ఎమోషన్ కూడా పెద్దగా కనెక్టవలేదు.

–> ఇక సినిమాలోని పాటలైతే ఏమాత్రం వినదగ్గవిగా లేవు. అసలే కథ బోర్ కొట్టుతున్న టైంలో వచ్చి మరింత విసుగు పుట్టించాయి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> హీరో పాతిక కోట్ల డబ్బు తీసుకుని విలన్ కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే విలన్ మాత్రం ఏమీ చేయలేకపోవడం వింతగానే ఉంటుంది.

ఇక చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా సాగింది..

మిస్టర్ ఏ : సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : అలా అడగొద్దు. కామెడీ ఎలా ఉంది అని అడుగు.
మిస్టర్ ఏ : అంటే?
మిస్టర్ బి : ఇందులో కామెడీ గురించి మాత్రమే మాట్లాడుకోగలం అంటున్నా.
మిస్టర్ ఏ : ఫస్టాఫ్ పర్లేదుగా ?
మిస్టర్ బి : సెకండాఫ్ ప్రభావంతో దాన్ని మర్చిపోయా.