కుదిరిన దోస్తీ : కధ సుఖాంతం

Friday, December 5th, 2014, 09:09:38 PM IST


మహారాష్ట్రలో బీజేపి సర్కారుకు ఇక తిరుగులేదు. చిరకాల మిత్రులు తిరిగి చేతులు కలిపాయి. సీట్ల సర్దుబాటు కాక ఎన్నికలకు ముందు విడిపోయిన బీజేపి శివసేన పార్టీలు… అనేక చర్చల అనంతరం కలిసిపోయాయి. అయితే మొదటినుంచి బీజేపి శివసేన కోసం కొన్ని పదవులను అట్టే పక్కన పెట్టింది. కాని శివసేన డిప్యూటి ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబట్టింది. ఇందుకు బీజేపి ససేమిరా అనడంతో… శివసేన బీజేపితో దోస్తీ కట్టేందుకు నిరాకరించింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య దోస్తీని కుదిర్చేందుకు ఆర్ఎస్ఎస్ సైతం మధ్యవర్తిత్వం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఎట్టకేలకు రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయి.

దీంతో ఈ రోజు దేవేంద్ర సర్కారు కేబినేట్ విస్తరణను చేపట్టింది. ఈ విస్తరణలో భాగంగా శివసేనకు మొత్తం 10 మంత్రి పదవులను కట్టబెట్టింది. అందులో ఐదు కేబినెట్ పదవులు కాగ, మరో ఐదు సహాయ మంత్రిపదవులు ఉన్నాయి. ఇక బీజేపి కూడా అదే పద్దతిని అనుసరించి.. 5 కేబినెట్ మంత్రి పదవులను, మరో ఐదు సహాయ మంత్రి పదవులను బీజేపి అభ్యర్ధులకు కట్టబెట్టింది. దీంతో మహారాష్ట్ర సర్కారు కధ సుఖాంతం అయింది.