తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుంది.. మంత్రి ఈటల అసహనం..!

Thursday, April 22nd, 2021, 06:14:58 PM IST


తెలంగాణకు వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి ఈటల రెమిడిసివేర్ ఇంజక్షన్లను కేంద్రం పరిధిలోకి తీసుకోవడం బాధకరమైన విషయమని, రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదని అన్నారు. గుజరాత్‌తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని మంత్రి ఈటల డిమాండ్ చేశారు.

అయితే హైదరాబాద్‌లో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక పేషంట్లు కూడా చికిత్స పొందుతున్నారని ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్ తమకే కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు మంత్రి ఈటల చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ విషయాంలో కేంద్రం కొంటె ఒక ధర, రాష్ట్రాలకు ఒక ధర పెట్టడం సరికాదని ఈటల అన్నారు. తెలంగాణలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీ హాస్పిటల్‌కు పంపుతున్నారని అన్నారు. ఆక్సిజన్ బ్లాక్‌లో సరఫరా చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్సిజన్ సరఫరా విషయంలో ఐఏఎస్‌ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుందని అన్నారు.