ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ముందా.. బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్..!

Wednesday, March 3rd, 2021, 06:32:30 PM IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని, దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టమైన ప్రకటన చేశారని అన్నారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటన గురించి కూడా తెలియకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.

అయితే బీజేపీ అధికారంలో ఉన్న బెంగళూరు పట్టణంలో కూడా ఐటీఐఆర్ ఒక అడుగు ముందుకు పోలేదని మరి దానికి కూడా మా ప్రభుత్వమే కారణమా అని ప్రశ్నించారు. అయితే 2014 నుంచి తాము రాసిన లేఖలు, సమర్పించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులన్ని బండి సంజయ్‌కి ఇస్తామని దమ్ముంటే ఐటీఐఆర్ లేదా ఐటీఐఆర్‌కి సమానమైన మరో ప్రాజెక్టుని హైదరాబాద్ నగరానికి తీసుకురాగలరా అని సవాల్ చేశారు. మీడియాలో ప్రచారం కోసం బండి సంజయ్ అసత్యాలు మాట్లాడుతున్నారని అలాంటివి మానుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.