సాగర్‌లో జానారెడ్డి గెలిచిన లాభం లేదు.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..!

Tuesday, April 6th, 2021, 02:19:09 AM IST


తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్ నాగార్జున సాగర్‌లో జానారెడ్డి చేసిన అభివృద్ధి ఎంటో ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికలో జానారెడ్డి గెలిచినా లాభం లేదని అన్నారు.

అయితే 35 ఏళ్ళు జానారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని అన్నారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మండలానికి ఒక మంత్రి, మండలానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, అంత మంది ఎక్కడ ఉన్నారో చూపించాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ బరిలో నిలిచాడు కాబట్టి జానారెడ్డి తప్పుకుని ఉంటే గౌరవం పెరిగేదని అన్నారు. నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ నేతలు చేసింది పెద్దగా ఏమీ లేదని అన్నారు.