దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు – మోపిదేవి వెంకటరమణ

Sunday, April 4th, 2021, 09:06:22 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గ్రామాల అభివృద్ధి కి ఎంతో కీలకం అయిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి పక్ష నాయకుని హోదాలో బహిష్కరించినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు అంటూ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు గా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సైతం పలు ఆరోపణలు చేశారు.

తెలుగు దేశం పార్టీ ఏజెంట్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డు పెట్టుకొనీ, కరోనా విపత్తును బూచి గా చూపి, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికలని జరగకుండా అడ్డుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్తానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న ఆయనకు మతి భ్రమించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కోర్టు తీర్పు నకు అనుగుణంగా కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఎన్నికలు నిర్వహిస్తుంటే అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ప్రజల చీత్కారాలు తప్పవు అని గ్రహించి కొత్త నాటకాలకు తెర తీస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.