ఈటలపై పోటీ చేసేందుకు సిద్దం.. టీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, May 5th, 2021, 07:46:00 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈటల వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయితే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ చాలా గౌరవంతోపాటు అనేక అవకాశాలు ఇచ్చారని, సొంత పార్టీ నేతలకే ఈటల వ్యతిరేకంగా పనిచేశారని లక్ష్మీకాంతరావు అన్నారు. ఆనాడు రైతుబంధును ఆయన వ్యతిరేకించారని, హుస్నాబాద్‌కు ఆర్డీవో మంజూరైతే దానిని హుజురాబాద్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. ఒక మంత్రిపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకునే అధికారం సీఎంకు ఉంటుందని అన్నారు. మంత్రి పదవి పోవడంతో ప్రజాభిప్రాయం సేకరించడం సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడించడం సరైంది కాదని ఈటలకు హితవు పలికారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు చెప్పుకొచ్చారు.