సీఎం జగన్‌కి షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ.. సీబీఐ కోర్టులో పిటీషన్..!

Tuesday, April 6th, 2021, 05:32:49 PM IST

ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో షాక్ ఇచ్చారు. సీబీఐ కేసులో ఏ-1గా ఉన్న సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నేడు మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, 11 సీబీఐ ఛార్జ్ షీట్లలో ఏ1గా ఉన్న సీఎం జగన్ విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత తనపై ఉందని, జగన్ నిర్దోషిలా బయటపడాలన్న ఉద్దేశ్యంతోనే పిటీషన్ దాఖలు చేసినట్టు చెప్పుకొచ్చారు.

అయితే ప్రభుత్వ పథకాలు, పాలన పేరు చెప్పి విచారణకు హాజర్ కాకుండా జగన్ తప్పించుకుతిరుగుతుంటే న్యాయవ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని, సీబీఐ కేసుల్లో నిందితులైన నలుగురికి రాజ్యసభకు పంపారని, అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని జగన్‌పై చురకలు అంటించారు. కోర్టు విచారణకు హాజర్ కాకుండా జగన్ తప్పించుకుంటుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, తన పదవిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.