రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : ఎం.ఎస్.ధోని – తెరపైనా సిక్సర్ కొట్టేసిన ధోని..!!

Saturday, October 1st, 2016, 02:53:11 PM IST


తెరపై కనిపించిన వారు : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా పటాని..

కెప్టెన్ ఆఫ్ ‘ఎం.ఎస్.ధోని’ : నీరజ్ పాండే

మూల కథ :

ఇండియన్ క్రికెట్‌కు తిరుగులేని విజయాలను అందించిన ధోని కెరీర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 28 ఏళ్ళ తర్వాత ఇండియన్ క్రికెట్‌కు రెండో వరల్డ్ కప్ రావడంలో ధోనీ చూపిన ప్రతిభ అసాధారణమైనది. అలాంటి ధోనీ ఈ స్థాయికి రావడం వెనుక పడిన కష్టాలు, ఎవ్వరికీ తెలియని అతడి కథల సమాహారమే క్లుప్తంగా ఎం.ఎస్.ధోని సినిమా.

విజిల్ పోడు :

1. బాలీవుడ్‌లో నీరజ్ పాండే స్థాయి వేరు. తీసింది మూడే సినిమాలైనా వాటితోనే ఒక బ్రాండ్ సృష్టించుకున్నాడు. అలాంటి నీరజ్ పాండే తీసిన సినిమా కావడం వల్ల కూడా ధోనికి ఈ స్థాయి క్రేజ్ రావడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక నీరజ్ పాండేపై ఆయన అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ నిజం చేస్తూ ఆయన తన స్క్రీన్‌ప్లేతో అదరగొట్టాడు. ధోని కథను ఇలా చెప్పొచ్చా అన్నట్లు కొత్త కోణంలో సినిమా చూపించాడు.

2. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పెద్ద హీరో ఏం కాదు. అయితే ధోని ట్రైలర్ విడుదలైనప్పట్నుంచే ప్రపంచం అతడిని స్టార్‌గా చూస్తూ వచ్చింది. ఇక ఇవ్వాళ సినిమా కూడా విడుదలయ్యాక సుశాంత్ కూడా ఇదే విషయాన్ని నిజం చేశాడు. అచ్చం ధోనీలానే కనిపిస్తూ, సుశాంత్ కనబర్చిన నటన అద్భుతం. అతడికి అలా విజిల్స్ వేస్తూనే పోవచ్చు.

3. ఫస్టాఫ్‌లో ఇండియన్ క్రికెట్ టీంలో చోటు కోసం ధోని పడిన కష్టాలను తెలుపుతూ వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. ఆ సన్నివేశాలు వస్తున్నప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. మూడు గంటలకు పైనే సినిమా నడుస్తూ ఉంటుంది. కాస్త ఇది ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే!

2. ధోనీ జీవితంలోని రెండు ప్రేమకథలను ఈ సినిమాలో చెప్పుకొచ్చారు. కొంచెం వీటి లెంగ్త్ ఎక్కువ చేసినట్లనిపించింది.

3. ఫస్టాఫ్ రేంజ్‌లో సెకండాఫ్‌లో లేకపోవడంతో కొన్ని చోట్ల నిరాశ తప్పలేదు.

దావుడా – ఈ సిత్రాలు చూశారు ..!!

–> ధోని అన్ టోల్డ్ స్టోరీ అని టైటిల్‌లోనే చెప్పేసినా, కాస్త అయినా అతడి ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పి ఉంటే బాగుండేదనిపించింది. ముఖ్యంగా ధోని అభిమానులకు కూడా ఆయన క్రికెట్‍లో సాధించిన విజయాలను చెప్పకపోవడం చిత్రంగానే కనిపిస్తుంది.

–> ఇక కెప్టెన్ అయ్యాక ధోని చుట్టూ ఎన్నో వివాదాలు వచ్చాయి. అవన్నీ ఎక్కడైనా సాధారణమే! వాటికి ధోని ఎలా స్పందించాడన్నది కూడా చెప్పకపోవడమూ చిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : ఇదేంటీ ధోని సినిమాలో ధోని క్రికెట్ కెరీర్‌నే తక్కువ చెప్పారూ?!
మిస్టర్ బి : టైటిల్‌లోనే ఉంది కదరా ఎవ్వరికీ తెలియని కోణంలో చెప్పిన కథనీ..!!
మిస్టర్ ఏ : అదే అదేలే! ఏదేమైనా ధోనీ లాస్ట్ బాల్ సిక్స్‌లాగా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ధోనీలాగ ఆ హీరో కూడా చింపేశాడు.