నా గర్ల్‌ఫ్రెండ్‌ని ఎలా కలవాలి.. ఏకంగా పోలీసులనే అడిగేశాడు?

Friday, April 23rd, 2021, 12:00:56 AM IST

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్ని కరోనా పేషంట్లతో నిండిపోయాయి. ఈ నేపధ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకై మహారాష్ట్ర సర్కార్ ఈ రోజు నుంచి మే 1 వరకు లాక్‌డౌన్‌ విధించింది. కేవలం అత్యవసర, నిత్యవసరాల కోసమే ప్రజలను బయటకు వదులుతున్నారు. ఎవరైనా అనవసరంగా బయట తిరిగేందుకు వస్తే పోలీసులు లాఠీలు విరిగేలా కొడుతున్నారు.

ఈ నేపధ్యంలో ముంబై పోలీసులను ఓ వ్యక్తి వింత కోరిక కోరాడు. నా లవర్‌ని మిస్ అవుతున్నానని, ఆమెను కలిసేందుకు బయటకు వెళ్లాలి అనుకుంటున్నా, నా వాహనం మీద ఏ రంగు స్టిక్కర్ వాడాలి అని ట్విట్టర్ ద్వారా అడిగాడు. అయితే ఆ వ్యక్తి ట్వీట్‌కి స్పందించిన ముంబై పోలీసులు మీకు ఇది ముఖ్యమైనదని మేం అర్థం చేసుకోగలం కానీ ఇది మా నిత్యవసర లేదా అత్యవసర జాబితాలో లేదని అన్నారు. అంతేకాదు దూరం బంధాలను మరింత బలపరుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారు. మీరు జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తున్నామని ఇది చాలా చిన్న అడ్డంకి, త్వరలోనే తొలిగిపోతుందంటూ సమాధానం ఇచ్చారు.