ఒకరు దోచేస్తే.. మరొకరు చీల్చేసారు!

Friday, June 12th, 2015, 06:35:17 PM IST


ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్ విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కష్టపడి పనిచేసి తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) దోచేస్తే మరొక పార్టీ (కాంగ్రెస్) నిర్దయగా చీల్చేసిందని మురళీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని, రాబోయే రోజుల్లో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా, జపాన్ దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని మురళీ మోహన్ తెలిపారు. ఇక అడ్డదిడ్డంగా విభజన చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మురళీ మోహన్ తీవ్రంగా విమర్శించారు.