రివ్యూ రాజా’ తీన్‌మార్ : నందిని నర్సింగ్ హోమ్ – ఆ హాస్పిటల్‌లో భలే ‘సస్పెన్స్’ ఉంది!

Friday, October 21st, 2016, 05:47:32 PM IST


తెరపై కనిపించిన వారు : నవీన్ విజయ్ కృష్ణ, శ్రావ్య, నిత్యా నరేష్..
కెప్టెన్ ఆఫ్ ‘నందిని నర్సింగ్ హోమ్’ : పీవీ గిరి

మూలకథ :

నందిని నర్సింగ్ హోమ్ అనేది హైద్రాబాద్ సిటీలోనే పెద్ద హాస్పిటల్స్‌లో ఒకటి. అందులో ఒక దయ్యం ఉందని ఎప్పుడూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అలాంటి నర్సింగ్ హోమ్‌లో చందు (నవీన్ విజయ్ కృష్ణ) డాక్టర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. డాక్టర్ ఉద్యోగం చేయడానికి చందుకు అర్హత లేకపోయినా, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదిస్తాడు. అప్పటికే విచిత్ర సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉండే నందిని నర్సింగ్ హోమ్‌లోకి చందు వచ్చాక అవి ఎక్కువవుతాయి. ఇంతకీ ఆ నర్సింగ్ హోమ్‍లో ఏం ఉంది? అన్నదే సినిమా.

విజిల్ పోడు :

1. ఫస్ట్‌సీన్‌తోనే ఈ హాస్పిటల్‌లో ఏదో ఉందని సస్పెన్స్ ఎలిమెంట్ మొదలుపెట్టి, క్లైమాక్స్‌లో గానీ ఆ సస్పెన్స్ ఏంటో చెప్పరు. క్లైమాక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సస్పెన్స్‌ను బయటపెట్టడం విజిల్స్ వేయించేలా ఉంది.

2. వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి స్టార్స్ ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ తమ ప్రెజెన్స్‌తో ఆ సినిమాల రేంజ్ పెంచుతూంటారు. ఈ సినిమాలోనూ వాళ్ళ కామెడీ అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అయితే విజిల్స్ వేయిస్తూనే ఉంటుంది.

3. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగుంది. ఒక దొంగ డాక్టర్ తనకు తెలియని ఉద్యోగం చేస్తూ ఉంటే పుట్టే కమర్షియల్ కామెడీ బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమానే అయినా అలాంటి ఒక పాత్రను హీరో నవీన్ సునాయసంగా చేసేశాడు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

1. సినిమా లెంగ్త్ రెండున్నర గంటలకు పైనే ఉంది. ఈ కథకు అంత లెంగ్త్ అవసరం లేదనిపించింది. అది కాస్త ఢమ్మాల్ పాయింటే!

2. హీరో పాత్ర కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్ తర్వాత కూడా కథ ఎమోషన్‌తో సంబంధం లేకుండా కామెడీగానే ప్రవర్తించడం కూడా ఢమ్మాలే!

3. కొన్ని చోట్ల లాజిక్‌తో సంబంధం లేకుండా సన్నివేశాలు నడవడం కూడా ఢుమ్మీల్‍లా తోచింది.

దావుడా – ఈ సిత్రాలు చూశారూ ..!!

–> సిటీలోనే పేరున్న హాస్పిటల్‍లో ఒక అనామకుడు డాక్టర్‌గా జాయిన్ అవ్వడమన్నది కాస్త సిత్రంగానే కనిపించింది. నమ్మేలా అనిపించేలా ఆ సన్నివేశాలను రూపొందించలేదు.

–> చివర్లో హీరోకి దొరికే ఓ సీసీ కెమెరా ఫుటేజే అసలు సస్పెన్స్‌ను బయటపెడుతుంది. కొన్నిసార్లు ఈ సీసీ ఫుటెజ్ అచ్చంగా సీసీ ఫుటేజ్‌లా కాకుండా, తెలివిగా సినిమాటోగ్రఫీ చేసిన సన్నివేశాల్లా ఉండడం చిత్రమే!

–> చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితుల సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఏ : వెన్నెల కిషోర్ కామెడీకి నవ్వలేక చచ్చాన్రా బాబూ..!! అదిరిపోయింది కామెడీ.
మిస్టర్ బీ : నాకైతే ఆ సస్పెన్స్ తెగ నచ్చేసిందిరా.. ఊహించలేదసలు..!!
మిస్టర్ ఏ : మంచి టైమ్‍పాస్ ఇచ్చింది. థ్రిల్ కూడా సూపర్.