దొంగ పనులు చేయడం దొరికిపోవడం జగన్ నైజం – నారా లోకేష్

Friday, March 5th, 2021, 02:32:22 PM IST

మరొకసారి వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. దొంగ పనులు చేయడం దొరికిపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతి ఎన్నికల్లో 80 శాతం గెలిచాం అని కాలర్ ఎగరేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు 80 శాతం గ్రామాల పై పడి ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా వారి గెలుపు లో నిజం లేదని ఒప్పుకున్నారు అంటూ నారా లోకేష్ విమర్శించారు. విధ్వంసం, దాడులతో పంచాయితీ ఎన్నికల్లో ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్నారు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా, కలవాయి మండలం, కేశంనేని పల్లిలో టీడీపీ గెలిచినా ఫలితాలు తారుమారు చేశారు అని ఆరోపించారు. ఇప్పుడు ఆ గ్రామం పై కక్ష తీర్చుకుంటున్నారు అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు దేశం పార్టీ కి మద్దతు పలికారు అన్న కక్ష తో 110 ఎకరాల్లో జొన్న, వేరు శనగ పంటను నాశనం చేశారు అంటూ నారా లోకేష్ అన్నారు. మరో ఐదు రోజుల్లో చేతికొచ్చే పంటను అధికార మదంతో వైసీపీ రౌడీ గ్యాంగ్ ట్రాక్టర్ల తో దున్నేసారు అని అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రైతుల కన్నీరు కి కారణమైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశం లో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నా ప్రేక్షక పాత్ర వహించి, రైతుల్ని బెదిరించిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే నారా లోకేష్ ఆ ఘటన కి సంబందించిన వీడియో ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.