నన్ను అర‌గంట తిట్టండి.. కానీ పరీక్షలు రద్దు చేయండి – నారా లోకేశ్

Friday, April 23rd, 2021, 03:00:55 AM IST

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌కి లేఖ రాశారు. అయితే రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మరోసారి సమీక్ష నిర్వహించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పడంతో సీరియస్ అయిన నారా లోకేశ్ జగన్‌ను మూర్ఖపు రెడ్డి అంటూ సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. అయితే లోకేశ్ హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో ఉన్న విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించడం హాస్యాస్పదమని, వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్థుల పరీక్షలను రాజకీయంగా వాడుకుంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేశ్ లోకేశ్‌కు కౌంటర్ ఇచ్చారు.

దీనిపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఘాటుగా స్పందించారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు! మీరు మొండిగా నిర్వ‌హిస్తామంటున్న ప‌రీక్ష‌ పాసో, ఫెయిలో నిర్ణ‌యించేది కాదు, 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, ప‌రీక్ష నిర్వ‌హించే 30 వేల‌మంది ఉపాధ్యాయులు, ల‌క్షలాది కుటుంబ‌స‌భ్యులంద‌రితో క‌లిపి దాదాపు కోటి మంది ప్రాణాల‌కు ఇది విష‌మ‌ ప‌రీక్ష‌ అని, అందుకే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాల‌ని ముఖ్య‌మంత్రి గారికి లేఖ రాశానని, ఆ లేఖ రాసిన ‌త‌రువాతే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారని అందుకే సీఎం జగన్ రెడ్డిని మూర్ఖ‌పురెడ్డి అని సంబోధించాల్సి వ‌చ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే పంతాలు, ప‌ట్టింపులకు ఇది స‌మ‌యం కాదని, న‌న్ను మీ నోటికొచ్చిన‌ట్టు మ‌రో అర‌గంట తిట్టండి.. కానీ ప‌రీక్ష‌లు మాత్రం ర‌ద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండి. నా విదేశీ చ‌దువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివ‌రాలు పంపిస్తాను. మీరు బాగా చ‌దువుకున్న‌వారే కాబ‌ట్టి అవి మీకు అర్థ‌మై, మ‌రోసారి తాడేప‌ల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోప‌ణ‌లు చేయ‌ర‌ని ఆశిస్తున్నాను. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి మంచి మేన‌మామ అనిపించుకుంటాడో, ప‌రీక్ష‌లు పెట్టి కంసుడులాంటి మేన‌మామ అనిపించుకుంటాడో మీ మూర్ఖ‌పు రెడ్డి ఇష్టం అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.