కుట్రలో చంద్రబాబు పాత్రకు ఆధారాలు?

Wednesday, June 3rd, 2015, 05:59:17 PM IST


తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వరంగల్ లో బుధవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణలో రాజకీయాలు పెను మార్పును సంతరించుకోబోతున్నాయని నాయిని పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబే కుట్రదారుడు అనేందుకు పక్కా ఆధారాలు ఏసీబీ అధికారుల వద్ద ఉన్నాయని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. అలాగే తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టిన కేసులో టిటిడిపి నేత రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఫోన్ సంభాషణల ఆడియో టేపులు పోలీసుల వద్దనున్నాయని నాయిని బాంబు పేల్చారు. ఇక నాయిని పేల్చిన బాంబు లాంటి ఈ వార్తతో తెలుగు రాష్ట్రాలలో కలకలం మొదలైంది.