రివ్యూ రాజా తీన్‌మార్ : ఓం నమో వెంకటేశాయ – ‘అన్నమయ్య’ మ్యాజిక్ చాలా వరకు రిపీటైంది !

Friday, February 10th, 2017, 05:40:09 PM IST


తెరపై కనిపించిన వారు : నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్, అనుష్క..

కెప్టెన్ ఆఫ్ ‘ఓం నమో వెంకటేశాయ’ : కె. రాఘవేంద్ర రావు

మూలకథ :
రామ్ (నాగార్జున) అనే వ్యక్తి చిన్నతనం నుండే దేవుడిని చూడాలి అనే కోరికతో తిరుమలలోని ఒక గురువు వద్దకు విద్యలు నేర్చుకుని, దేవుడి ప్రసన్నం కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుడిని చూడ్డానికి వెళ్తాడు. కానీ కొందరి వల్ల అది సాధ్యపడదు.

ఆ క్రమంలోనే అతను కృష్ణమ్మ(అనుష్క) అనే భక్తురాలితో కలిసి తిరుమల్లో జరిగే అన్యాయాలను అరికట్టి, దేవుడికి అన్ని సేవలు సక్రాంగ జరిగేలా చూస్తాడు. అతని భక్తికి మెచ్చిన దేవుడు అతనికి ఆప్తుడిగా మారిపోతాడు. అలా బలపడ్డ వారి బంధం ఎలా నడిచింది ? రామ్ భక్తి ఎలాంటిది ? అతను హాతిరామ్ బావాజి అలా అయ్యాడు ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :
–> ముందుగా మొదటి విజిల్ హాతిరామ్ బావాజి పాత్రలో నాగార్జున చూపిన నటనకు వెయ్యాలి. అంత బాగా నటించాడాయన. కళ్ళలో భక్తి, నడవడిక, భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ గొప్పగా ఉన్నాయి. ఒక్క మాటలో అలనాటి ‘అన్నమయ్య’ను గుర్తుకు తెచ్చాడనే చెప్పాలి.

–> ఇక రెండవ విజిల్ వేంకటేశ్వర స్వామి పాత్రను ధరించిన ‘సౌరబ్ రాజ్ జైన్’ కు వెయ్యాలి. చాలా సన్నివేశాల్లో ఆయన్ను చోస్తుంటే నిజంగా దేవుడి ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో సైతం ఆయన బాగా నటించారు.

–> ఇక సెకండాఫ్ లో భక్తుడికి, దేవుడికి మధ్య నడిచే పాచికలాట, ప్రీ క్లైమాక్స్ లో దేవుడే భక్తుడి కోసం ఆరాటపడటం, క్లైమాక్స్ ఎపిసోడ్లు చాలా ఎమోషనల్ గా కనెక్టయ్యాయి. రాఘవేంద్ర రావు కూడా భక్తికి, ఆదరణకు మధ్య ఉన్న విడదీయరాని సంబధాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు. కనుక ఆయనకు మూడవ విజిల్ వేయోచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> సినిమా సెకండాఫ్ లో వచ్చే కృష్ణమ్మ(అనుష్క) గత జీవితం అంతగా ఆకట్టుకోలేదు. పైగా బాగా నడుస్తునానఁ కథానాయికి అడ్డు తగిలినట్టు తోచింది.

–> ఫస్టాఫ్ లో రావు రమేష్ పై వచ్చే సీన్లు కొన్ని రొటీన్ గా ఉన్నాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే మాంత్రికుడి పాత్ర ఎలాంటి ప్రభావం చూపకుండా అంతమవడం బాగోలేదు.

ఇంతకు మించి ఈ సినిమాలో ఢమ్మాల్ అంశాలేవీ లేవు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..!

–> ఆద్యంతం భక్తి భావంతో నడిచే ఈ సినిమాలో వింతైన సాన్నివేశాలు ఏవీ తగల్లేదు. ఎందుకంటే దర్శకేంద్రుడి దర్శకత్వం కదా.

సినిమా చూసిన వెళుతున్న ఇద్దరు స్నేహితుల మాటలు ఇలా ఉన్నాయి..

మిస్టర్ ఏ: సినిమా బాగుంది కదరా.
మిస్టర్ బి : బాగుంది.
మిస్టర్ ఏ: నీకు ఏయే పాయింట్స్ నచ్చాయి.
మిస్టర్ బి : చాలానే ఉన్నాయిలే.
మిస్టర్ ఏ: అవును నీకు డివోషనల్ సినిమాలు అంతగా నచ్చవు కదా .
మిస్టర్ బి: నిజమే. కానీ ఈ సినిమా నచ్చింది.
మిస్టర్ ఏ: అంటే.. ‘అన్నమయ్య’ మ్యాజిక్ రిపీట్ అయ్యిందన్నమాట.