మోడీ ర్యాలీ ఫ్లాప్ అయిందట..!

Wednesday, January 21st, 2015, 01:16:00 PM IST


ఢిల్లీలో మాటల యుద్ధం మొదలైంది. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒక పార్టీపై మరో పార్టీ మాటల బాణాలను సంధించుకుంటున్నాయి. ఇక తాజాగా, ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దాంత యోగేందర్ యాదవ్ తన మాటలకు పదును పెట్టారు. కిరణ్ బేడి, షాజియా ఇల్మీ వంటి వారు బీజేపిలో చేరడం దారుణమైన పరిణామమని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపికి అర్ధబలంతో పాటు మీడియా బలం, కార్పోరేట్ బలం దండిగా ఉన్నాయని, బీజేపి మోసపూరితమైన పార్టీ ఆయన విమర్శించారు. పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన వాటిని నేరవేర్చడంతో విఫలం అయిందని అన్నారు. ఇక, బీజేపి అర్ధబలంతో గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. నల్లదనాన్ని వెనక్కి తెస్తామని చెప్పిన బీజేపి ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీ బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దించిన కిరణ్ బేడి గురించి కూడా యోగేందర్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

కిరణ్ బేడి మోసపూరితమైన పార్టీలో చేరడం మంచిది కాదని, ఆపార్టీ ఢిల్లీలో ఫిబ్రవరి 7న జరిగే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమని ఆయన తెలిపారు. జనవరి 10న బీజేపి ఏర్పాటు చేసిన మోడీ సభకు కేవలం 25వేలమంది మాత్రమే హాజరు అయ్యారని, మరి ఏవిధంగా బీజేపి ఢిల్లీలో గెలుస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు చైతన్యవంతులయ్యారని, బీజేపిని ప్రజలు తప్పకుండ ఓడిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.