ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.. పవన్ కళ్యాణ్ డిమాండ్..!

Tuesday, April 20th, 2021, 06:34:18 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షల మంది విద్యార్థులు, కుటుంబాలను కరోనా ముప్పులోకి నెడుతున్నారని ఆరోపించారు. సీబీఎస్ఈ కూడా ఇప్పటికే పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసిందని, పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచాయని కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల విషయంలో మూర్ఖంగా ఆలోచిస్తుందని తక్షణమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో నేటి నుంచి 1-9వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని అంతేకాకుండా షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.