తానా సభల్లో పవన్ ఏమన్నాడో విన్నారా..?

Saturday, July 6th, 2019, 10:32:59 AM IST

అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.. తానా మహాసభలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి రోజు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యి, తనదైన రీతిలో అద్భుత ప్రసంగం చేశాడు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర వైఫల్యం తర్వాత పవన్ కళ్యాణ్ తేరుకోవటం కష్టమనే అభిప్రాయం గట్టిగా వినిపించింది, దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అందరు అనుకున్నట్లు ఓటమి నన్నేమి కృంగతీయలేదు, ఓడిపోయామని తెలిసిన పావుగంటలోనే దాని నుండి నేను బయటకు వచ్చాను.

ఎన్నికల్లో గెలవాలని, అధికారం చేపట్టాలని నేను రాజకీయాల్లోకి రాలేదు. గెలిచినా,ఓడినా కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాను. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఓట్లు కోసం నోట్లు పెద్ద ఎత్తున పంచారు, కానీ జనసేన నుండి అలాంటి పనులు ఏమి చేయలేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. విలువల కోసం కట్టుబడి పనిచేస్తున్నంత కాలం గర్వంగా తలెత్తుకొని ఉండగలం. తప్పులు చేసి జైలుకి వెళ్లి వచ్చిన వాళ్లే ఎలాంటి భయం లేకుండా ఉంటున్నారు. అలాంటిది సత్యాన్ని మాట్లాడే నేను ఎందుకు ఇబ్బందిపడాలి.

ఓడిపోయిన కానీ మళ్ళీ లేచి పరిగెత్తే గుణం నాలో ఉంది, నాకు నెల్సన్ మండేలా స్ఫూర్తి. ఆయన అనుభవించిన కష్టాలు ఇంకా ఎవరు అనుభవించలేదు. నేను పడిన ప్రతి కష్టం నన్ను విజయానికి దగ్గర చేసింది. నేను విజయం కోసం ప్రతిసారి ఎంతగానో తపించేవాడిని, సినిమా పరంగా చెప్పాలంటే ఖుషి తర్వాత నాకు సరైన హిట్ లేదు, హిట్ కోసం నేను గబ్బర్ సింగ్ దాక ఎదురుచూశాను. నాకు ఓపిక ఎక్కువ కాబట్టి ఓడిపోతే రాజకీయాలకి దూరం అవుతానని అనుకోవద్దంటూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్.