రాజధాని రైతుల త్యాగాలు వృథాకానీయం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Monday, July 6th, 2020, 02:15:52 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దాదాపు 200 రోజులకు పైగా రాజధాని గ్రామాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని రైతుల త్యాగాలు వృధాకానీయమని, వారికి జనసేన అండగా నిలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

గతంలో ఏపీ రాజధాని అమరావతి అని నిర్ణయం అయ్యింది కాబట్టే రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని, తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అవమానించడమే అంటూ జనసేన ముందు నుంచి చెబుతుంది. అయితే భారతీయ జనతా పార్టీతో కలిసి రైతులకు అండగా నిలబడతామని, ఎట్టి పరిస్థితులలోనూ 29 వేల మంది రైతుల త్యాగాలను వృథాకానీయమని అన్నారు. రైతులకు కౌలు చెల్లింపులు కూడా సరిగ్గా జరగడం లేదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అంతే తప్పా రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాదని అన్నారు. ఏ జిల్లాను ఏ విధంగా అబివృద్ధి చేయాలి? ఏ ఏ రంగాలను ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ధి ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు.