టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్..!

Saturday, May 8th, 2021, 11:50:30 AM IST


పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారు. అయితే మాజీ మంత్రి ఈటలకు సన్నిహితంగా ఉన్న పుట్ట మధు, ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నాటి నుంచే కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే తాజాగా పుట్ట మధును అరెస్ట్ చేసిన పోలీసులు ఏ కేసులో ఆయనను అరెస్ట్ చేశారన్న విషయాన్ని వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు అతని అనుచరులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంథని కోర్టు ఆదేశాల మేరకు పుట్ట మధు భార్య పుట్ట శైలజపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్న చర్చ జరిగుతుంది. అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్‌ బయలుదేరి అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో పుట్ట మధును పోలీసులు అరెస్టు చేశారా లేదా వేరే ఇతర కేసులో అరెస్ట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.