సినిమాలలో పోలీసులను కించపరచొద్దు!

Tuesday, October 21st, 2014, 12:03:02 PM IST


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గోషా మహల్ లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని కొనియాడారు. అలాగే ఏటా అమరవీరులను స్మరించుకోవడం మంచి సాంప్రదాయమని కెసిఆర్ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థను చెడుగా చూడడం దేశానికే మంచిది కాదని తెలిపారు. అలాగే మీడియా, సినిమా వాళ్ళు పోలీసులను కించపరిచేలా చూడడం, మాట్లాడడం సరికాదని కెసిఆర్ హితవు పలికారు. ఇక విధి నిర్వహణలో అమరులైనవారు దేవునితో సమానమని, వారి కుటుంబాలకు వందశాతం అండగా ఉంటామని కెసిఆర్ స్పష్టం చేశారు. అలాగే ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులు విజయం సాధించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.