ప్రధాని కార్యాలయం వద్ద దీక్ష చేయి.. బండి సంజయ్‌కు పొన్నం సవాల్..!

Thursday, May 6th, 2021, 12:30:03 AM IST

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు హింస చేలరేగగా ఆ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ హింసను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టారు. అయితే బండి సంజయ్ దీక్షపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ బీజేపీ నేతలు పక్క రాష్ట్రాల్లో అల్లర్లపై దీక్షలు చేయడం కాదని మన రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడేసివివర్ ఇంజక్షన్లు దొరక్క ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ముందు ఈ సమస్యపై ప్రధాని కార్యాలయం వద్ద దీక్ష చేయాలని సూచించారు.

అయితే బీజేపీ నేతలు చేస్తున్న దీక్షలు ప్రస్తుతమున్న ఆరోగ్య పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలను అవమానపరిచేట్లుగా ఉన్నాయని పొన్నం ప్రణాకర్ అన్నారు. బండి సంజయ్ ప్రధానితో మాట్లాడి, రాష్ట్రానికి అవసరమైన వైద్య సహకారాన్ని అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాలని వారు భావిస్తే, ప్రగతి భవన్ ముందు ధర్నాకు దిగాలని పొన్నం సూచించారు.