ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు కన్నుమూత..!

Saturday, May 22nd, 2021, 07:02:53 AM IST

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, సినీ పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే సినిమా జర్నలిస్టుగా కెరిర్‌ను ప్రారంభించిన బీఏ రాజు దాదాపు 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా చేశారు. దీంతోపాటు పలు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. సూపర్ హిట్ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా, నిర్వాహకుడిగా కూడా వ్యవహరించారు. బీఏ రాజు భార్య బీ జయ 2018లోనే కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బీఏ రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.