‘ పహిల్వాన్ ‘ ప్రీ ఈవెంట్ లో ‘పురాణపండ శ్రీనివాస్’

Saturday, September 7th, 2019, 12:25:46 PM IST

సుమారు దశాబ్ద కాలం నుంచీ సభలకు, సమావేశాలకు చాలా దూరంగా ఉంటూ అద్భుత గ్రంధాలతో పవిత్ర సంచలనాలు సృష్టిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అకస్మాత్తుగా ‘ పహిల్వాన్ ‘ ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో తళుక్కున మెరిశారు.

ఈగ ఫేమ్ ‘ సుదీప్ ‘ హీరోగా వారాహి చలన చిత్రం సంస్థ తెలుగులో విడుదల చేస్తున్న ‘ పహిల్వాన్ ‘ ప్రీ ఈవెంట్ గ్రాండ్ ఫంక్షన్ లో వ్యాఖ్యాత సుమ హఠాత్తుగా పురాణపండ శ్రీనివాస్ ని స్నేహపూర్వకంగా వేదికపైకి ఆహ్వానించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పి.వి.సింధు ముఖ్య అతిధిగా హాజరైన ఈ అపూర్వమైన కార్యక్రమంలో, అతిరధ మహారధులైన సినీప్రముఖుల సమక్షంలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పి.వి. సింధుని ఈవెంట్ పక్షాన ఘనంగా సత్కరించారు. ఈ సత్కారానికి కృతజ్ణతగా పి.వి. సింధు పురాణపండ శ్రీనివాస్ కు వినయ పూర్వకంగా అభివాదం చేశారు.

హీరో సుదీప్, దర్శకుడు ఎస్.కృష్ణ , హీరోయిన్ ఆకాంక్ష సింగ్, నిర్మాత సాయి కొర్రపాటి దర్శకుడు బోయపాటి శ్రీను , పి.వి. సింధు తల్లిదండ్రులు, గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి , సంభాషణల రచయిత హనుమాన్ చౌదరి, సీనియర్ క్రికెటర్ చాముండేశ్వరినాద్ తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ సభలో పురాణపండ శ్రీనివాస్ ఒక్క పదం కూడా మాట్లాడకుండా మౌనంగా సత్కరించి వెళ్లడం గమనార్హం. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటితో తనకున్న ఆత్మీయబంధం కోసమే తానీ సభకు వఛ్చినట్లు మీడియా మిత్రులతో పురాణపండ శ్రీనివాస్ అన్నట్లు సమాచారం.

శ్రీనివాస్ రావడం చూసిన సుమ ఏకంగా ఒక్క సారిగా పురాణపండ శ్రీనివాస్ ను వేదికపైకి ఆహ్వానించడంతో … తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రోగ్రాంను లైవ్ లో చూస్తున్న చాలామంది రాజకీయ, సామాజిక, సాహిత్య, సినీ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు ‘ చాలాకాలంగా మౌనంగానే వున్న ఈ ప్రతిభావంతుడు ఇన్నాళ్ళకైనా వేదికపై కనిపించారని’ సంతోషాన్ని ప్రకటించినట్లు సమాచారం. జీవన యాత్రలో ఎన్నెన్నో ఆటుపోట్లను మానసికంగా తట్టుకున్న పురాణపండ శ్రీనివాస్ ను ఈ రకంగానైనా వేదికపైకి తీసుకొచ్చి ఆయన మిత్రులకు, సన్నిహితులకు, స్నేహితులకు , బంధు గణాలకు ఆనందాన్ని పంచిన శ్రేయ మీడియా వారిని , వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటిని చాలామంది అభినందించడం విశేషం.

పహిల్వాన్ సభలో ఇదొక మధుర ఘట్టంగా చెప్పకనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకూ ఈ వేదికపై జరిగిన ప్రతీ సన్నివేశం ఒక వేడుకగా , సంబరంగా జరిగిందని ఆహూతులందరూ ప్రశంసలు వర్షిస్తూనే వున్నారు. పహిల్వాన్ హిట్ కోసం ఎదురు చూద్దాం.