అసలు వంట పని మగాళ్ళదేనట!

Friday, May 22nd, 2015, 04:59:24 PM IST


ప్రముఖ దర్శకుడు వివాదాల రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా టీవీలోని ఒక వంటల కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వర్మ మాట్లాడుతూ తమను డామినేట్ చేస్తారనే నీచబుద్ధితో భయపడి మగవారు ఆడవారిని వంటింటికి పరిమితం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే అసలు వంట అన్నది మగవాళ్ళ పనని, అప్పట్లో మగవాళ్ళే వంట చేసేవారని, అందుకే ‘నలభీమ పాకం’ అనే పేరు వచ్చిందని వర్మ వివరించారు.

ఇక తాను వంటింట్లోకి వెళ్లి సుమారు 20ఏళ్ళు అయ్యిందని, ఆకలేస్తే టేబుల్ పై గడ్డి ఉన్నా తింటానని వర్మ తెలిపారు. అలాగే గడ్డిలో చాలా పోషకాలు ఉంటాయని, అందుకే జంతువులకు బీపీ, షుగర్ ఉండవని, రుచిగా వంటలు చేసుకునే మనుషులకే జబ్బులని తన స్టైల్ లో వర్మ వ్యాఖ్యానించారు. ఇక అప్పుడప్పుడు గడ్డి తింటే వంటికి మేలని చెప్పిన వర్మ, మగవారితో వంట చేయించుకోమని ఆడవారికి సలహా కూడా ఇచ్చారు.