తాను ఆ పార్టీనే అని చెప్పేందుకే ఎన్టీఆర్ ఆ సీన్ చేశాడా..?

Monday, December 28th, 2015, 11:43:40 AM IST

2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ పార్టీలోకి ఆహ్వానించింది. ఆహ్వానించడమే కాదు.. ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించే బాధ్యతను కూడా అప్పగించింది. ఆ బాధ్యతను ఎన్టీఆర్ బాధ్యతాయుతంగా నిర్వహించారు. అయితే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హవా కొనసాగడంతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయితేనేం.. ప్రచారం చేసిన ఎన్టీఆర్ భళా అనిపించుకున్నాడు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి మంచి లీడర్ అవుతారని చాలా మంది అప్పుడే చెప్పేశారు.

ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఎన్టీఆర్ ను క్రమంగా పార్టీ దూరంగా పెట్టింది. గతేడాది 2014 ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పిలవలేదు. ఈ సారి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అయితే, పెద్ద ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోనే తాను ఉంటానని.. పార్టీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి తన సహకారం అందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ ల మధ్య దూరం పెరిగింది. ఈ దూరాన్ని తగ్గించేందుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇక, ఇదిలా ఉంటే, ఆదివారం రోజున ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో విడుదలైంది. ఆ ఆడియో కార్యక్రమంలోనే ధియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో తారక్ సైకిల్ పై వచ్చే సీన్ ఉన్నది. ఈ సీన్ చూస్తుంటే.. తాను ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వాడినే అని చెప్పే విధంగా ఉన్నదని కొంతమంది అంటున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీవాడినే అని చెప్తున్నా.. ఆ పార్టీ అగ్రనేతలో ఎందుకని చలనం రావడంలేదో అర్ధం కావడం లేదు.