ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి వేసింది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే ప్రజారోగ్యం కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామని, అంతేకానీ ఎవరిపైనా పైచేయి సాధించాలని మాత్రం ప్రభుత్వం ఎన్నికల వాయిదా కోరలేదని అన్నారు. ఎన్నికల అంశంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, ఎస్ఈసీ నిర్ణయించినట్లే ఎన్నికలు జరుగుతాయని సజ్జల స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికిప్పుడు నిర్వహించడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే ఎస్ఈసీదే బాధ్యత అని, ఉద్యోగులతో సీఎస్ చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటామని, ఎవరెన్ని చేసినా విజయం వైసీపీదేనని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.