వాళ్ళు మళ్ళీ నామినేషన్లు వేసుకోవచ్చు.. ఎస్ఈసీ సంచలన నిర్ణయం..!

Monday, March 1st, 2021, 10:43:03 PM IST


ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కార్పొరేషన్‌‌తో పాటు పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి అవకాశం కల్పించారు. అయితే వైసీపీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని పలువురు అభ్యర్థులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేయడంతో, ఆ ఫిర్యాదులను పరిశీలించిన ఎస్ఈసీ తిరిగి వారంతా నామినేషన్లు వేసేందుకు అంగీకరించింది.

అయితే తిరుపతి కార్పోరేషన్‌లో 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, రాయచోటిలో 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మార్చి 3వ తేది మధ్యాహ్నం వరకు అభ్యర్థులు రీ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. అదే రోజు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరుపనున్నట్టు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది.