బిగ్ ట్రెండింగ్ : అమెరికాలో ప్రణయ్-అమృత విషాద గాధ

Tuesday, August 20th, 2019, 11:16:53 AM IST

దాదాపు ఏడాది క్రితం తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రణయ్,అమృత విషాద సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకునేలా, సభ్య సమాజం తల దించుకునేలా చేస్తూ, కుల గజ్జి విశృంఖలమైన రక్త విన్యాసం చేస్తూ దారుణమైన సంసృతిని మరోసారి గుర్తుచేస్తూ ప్రణయ్ ని బలితీసుకుంది. తమ కులం కంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనే ఒకే ఒక కారణంతో అమృత వాళ్ళ నాన్న మారుతీ రావు సుపారీ హంతుకులతో తన అల్లుడిని చంపించి తన కన్న కూతురికి తీరని శోకాన్ని మిగిల్చాడు.

అప్పట్లో నేషనల్ మీడియా కూడా దీని గురించి ప్రస్తావించింది. తాజాగా అమెరికాకి చెందిన ప్రముఖ వార్తాపత్రిక “వాషింగ్టన్ పోస్ట్” ప్రణయ్-అమృత సంఘటన గురించి దాదాపు 1500 వర్డ్స్ ఒక పెద్ద కథనాన్ని వెలువరించింది. ఇందులో ప్రణయ్-అమృత ప్రేమ,పెళ్లి గురించి ఆ తర్వాత జరిగిన పరిస్థితుల గురించి, ప్రణయ్ హత్యకి దారితీసిన సంఘటనల గురించి, మారుతీ రావు ఆలోచనల గురించి, మరి ముఖ్యం ఇండియాలో ఉన్న “కులం” అనే మహమ్మారి గురించి కూలంకుషంగా వివరించింది.

అంతే కాకుండా ఇండియాలో ఎంత పర్శంటేజ్ కులం అనే రొచ్చులో పడిపోయి, పరువు హత్యలు చేస్తున్నారో, కులం అనే మూసుకులో ఎలాంటి అన్యాయాలకు తెగబడుతున్నారో, కులం అనే కంపు వాసనవస్తే చాలు, వాడు చేసిందా తప్పా..ఒప్పా అనే ఆలోచన లేకుండా దానికి వత్తాసు పలికే ఈ సమాజం గురించి కూడా ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో వివరించింది. ప్రస్తుతం ఈ టాపిక్ అమెరికా లో మోస్ట్ పాపులర్ క్యాటగిరిలో టాప్ ట్రేండింగ్ లో నడుస్తుంది.

ఒక పక్క రోదసీలోకి చంద్రయాన్ ని ప్రవేశపెట్టి శాస్త్ర విజ్ఞాన రంగంలో అగ్రపథాన దూసుకొని వెళ్తూ ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల సత్తా ఏమిటో సగర్వంగా చాటుతున్న మనదేశంలో, మరో పక్క కులం అనే జాడ్యంతో కకావికలం అవుతూ ఇలాంటి పరువు హత్యలు కూడా జరగటం మన దేశం యొక్క తిరోగమనికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఒక పక్క ఈ రోజే చంద్రయాన్ 2 ని చంద్రుడి కక్షలో భారతదేశం ప్రవేశపెట్టబోతుందనే వార్త ఒక వైపు. భారతదేశంలో కులం పేరుతో దారుణమైన హత్యలు జరుగుతున్నాయనే వార్త మరో వైపు చూడాల్సి రావటం నిజంగా బాధాకరం.